కార్ హార్న్-జన విన్యాసాలు!!

వాహనం నడిపేటప్పుడు మనిషి యొక్క భావోద్వేగాల్ని వ్యక్తం చెయ్యడానికి భగవంతుడు కార్ హార్న్ సృష్టించాడనుకుంటా.కొంతమందికి ఎంత సరదానో అదే పనిగా కార్ హార్న్ మోగించడం ముందు వాహనాలు ఉన్నా లేక పోయినా.బహుశా వాళ్లకు ఉన్న సరదా,ఉత్సాహం, నిరాశ (ఫ్రస్ట్రేషన్) విసుగు (ఫెటీగ్) అసహనం.

(ఇన్ టాలరెన్స్) కూడా అలా రోడ్డుమీద వ్యక్తం చేస్తూ ఉంటారనుకుంటా-వాళ్ళమొహాలు చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది!

బహుశా మనిషికున్న అసహనాన్ని ప్రదర్శించడానికి రోడ్డుకన్న మిన్నలేదు కదా- అదీ వాహనం నడుపుతూ! సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ రాగానే వీళ్లు మైలు దూరంలో ఉన్నా హార్న్ మోగిస్తూనే ఉంటారు.వీళ్లు వేగంగా వెళ్ళాలి కాబట్టి ముందువాడు నెమ్మదిగా వెళ్తుండేవాణ్ని ఊదర కొట్టేస్తారు-వీళ్లకి దోవ ఇచ్చేంత వరకూ!

ఇంకోరకం మనుషులు వుంటారు- సాధారణంగా రద్దీ ఉన్న రోడ్లమీద వాహనాలు ఒక దాని వెంట ఒకటి వెళ్తుంటాయి-పెళ్లివారి ఊరేగింపులా -మనం కూడా గుంపులో గోవిందా అనుకుంటూ మెల్లిగా సాగిపోవాలి- ఆహా… అలా ఉండరు వీళ్ళు- కొద్దీ ఖాళీ కనపడితే హార్న్ వేస్తూనే ఉంటారు-ముందు వాహనాన్ని దాటుకుంటూ వెళ్లిపోదామనే.

మరో విచిత్రమైన వీరులు ఉంటారు- దూరంనుంచే హార్న్ వేసుకుంటూ వస్తారు- “గంటల బండి”లాగా (ఫైర్ ఇంజిన్) హార్న్ వేసేవాడికి గానీ, వాడి ఇంట్లోవాళ్లకి గానీ ఏదో ప్రమాదఘంటికలు మోగాయని భావించి మనం దారి ఇవ్వాలి-మన వాహనాన్ని నడుపుకుంటూనే పక్కకి జరిపి, లేదంటే మన వాహనాన్ని కొట్టుకుంటూ వెళ్లిపోతారు.

ఇంకో విచిత్రమైన అలవాటు ఉన్న వాళ్ళూ ఉన్నారు లెండి- మనము నిత్యం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం.ఏదైనా “అంబులెన్సు వాహనం” కనపడితే చాలు, జనాలు దానికి దారి ఇస్తారుగా- అంతే… దాని వెనకే ఆ అంబులెన్సుని వెంబడిస్తూ వెళ్తారు తమ వాహనంలో- అక్కడికేదో ఆ అంబులెన్సులో ఉన్నవాళ్ళు వీళ్ళ బంధువులే అన్నట్టుగా!

ఇంకోరకం మనుషులున్నారు-ఎవరైనా “టోల్ గేట్” దగ్గర ఎందుకు ఆగుతారు- అదేమైనా “కేఫే కాఫీ డే”నా-కబుర్లు-కాకరకాయకి,కాఫీకి ఆపటానికి. సాధారణంగా గేట్ దగ్గర సెన్సర్ “కార్ ఫాస్టాగ్” ని కనిపెట్టిన తర్వాత గేట్ పైకి లేస్తుంది- ఈ ప్రక్రియ పూర్తవడానికి కొన్ని సెకండ్లు పడుతుంది.ఏదైనా కారణాన ఆటో సెన్సర్ పనిచేయకపోతే ఆ మనిషి హ్యాండ్ సెన్సర్ తో కార్ దగ్గరకు వచ్చి సెన్సర్ తో చెక్ చేయగానే గేట్ తెరుచుకుంటుంది.ఈ సంగతి చదువులేని వాడికి కూడా తెలుసు- కానీ కొంతమంది చదువుకున్నపోటుగాళ్ళు మాత్రం వెనకనుంచి హార్న్ వేస్తూనే ఉంటారు- వీళ్ళని ఏమనాలి!

కొంత మంది రాజకీయ నాయకులు,వాళ్ళ అనుంగు శిష్యులు,కొడుకులు, పైరవీకారులు వీరంగం వేస్తుంటారు టోల్ గేట్ దగ్గర.వీళ్ళు హార్న్ వేయటం గట్రా లాంటివి ఉండవు-“గవర్నర్ కార్ ముందు పైలట్ కార్” అనుకుంటారు వాళ్ళ వాహనాన్ని- గేట్ పగలగొట్టు కుంటూ కూడా వెళ్లిపోతుంటారు- వీళ్ళలో కొందరు.

పేపర్లో లోనూ, టి.వి లోనూ మనం చూస్తూనే ఉంటాం- వీళ్ళ పవర్,ప్రతాపం ఈ టోల్ గేట్ దగ్గర అర్భకుల మీద చూపిస్తుంటారు- “పిచిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు” అధికార దర్పం-పొగరు అంటే అదే మరి.

జనం యొక్క అసహనం అంతా మన దేశపు రోడ్లమీద నిత్యం చూస్తూనే ఉంటాం; వీళ్ళే చాలా అసహనంతో“సహనంగా ఎలా ఉండాలో”అని జనాలకి క్లాసులు పీకుతుంటారు!

ఇన్ని విచిత్రాలు, విన్యాసాలు, పోకడలు, నిత్యం చూసిన తరవాత మనం కూడా ఇలా మారిపోతూ ఉంటాం ఒక్కొక్క సారి- మనకు ఇష్టం లేక పోయినా-ఇది మరి అంటువ్యాధాయే.ఎంచేతంటే పైన చెప్పినవాళ్ళ మీద ఉన్న కసి- వాళ్ళని ఏం చేయలేము కదా- మన ఉక్రోషం అంతా ఆ విధంగా వికారంగా మారిపోతూఉంటుంది మరి-మనకు తెలియకుండానే!

ఒక్కొక్కసారి ఈ వికారాల ప్రభావం ఆఫీస్ వాళ్ళ మీద, ఇంట్లోవాళ్ళ మీద కూడా చూపించడం కద్దు- మనం ఏమైనా మానవాతీత శక్తులు ఉన్నవాళ్ళం కాదుగా మనమూ సగటు మనుషులమే కదా మరి!

ఏది ఏమైనా కార్ హార్న్ వేయడం ద్వారా మనం అవతల వాళ్లతో మన భావాలు వ్యక్తం చేస్తున్నట్టే.అంచేత అప్పుడప్పుడు మనం కూడా ఇలా చేసినా పెద్దగా బాధ ఇబ్బంది పడక్కర్లా- ఆ భాషేదో మనకూ వచ్చేసినట్టే మరి!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!